Studio18 News - తెలంగాణ / : Harish Rao : రేవంత్ రెడ్డిని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయంటూ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ నేతలు రోజుకో మాట్లా మాట్లాడుతున్నారని హరీశ్ రావు అన్నారు. కేబినెట్ మీటింగ్ తరువాత ప్రెస్ మీట్ పెట్టి రూ. 31వేలకోట్లు 41లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు.. బడ్జెట్ లో చూస్తే రూ. 26 లక్షల కోట్లు పెట్టావ్.. చివరికి రుణమాఫీ చేసింది కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతీఒక్కరికి రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి.. ఇవాళ రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బందాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మీ దరిద్రపు గొట్టు రాజకీయం వల్ల మీ పాలనలో కుటుంబ బంధాలన్నీకూడా చెడిపోతున్నాయంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు. పెళ్లికాని వాళ్లకు రుణమాఫీ ఇవ్వని పరిస్థితి ఉందని పేర్కొంటూ హరీశ్ రావు ఓ ఉదాహరణ చెప్పారు. కుంబాల సిద్ధారెడ్డి అనే వ్యక్తికి ఒక లక్ష 99వేలు అప్పు ఉంది. రుణమాఫీ కాకపోయే సరికి ఆయన వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లాడు. వాళ్లు నీ భార్య పేరు నమోదు కాలేదు.. నీ భార్య పేరు, ఆధార్ కార్డు ఇవ్వాలని కోరారట. నేను పెళ్లి చేసుకోలేదని చెబితే నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే రుణమాఫీ కాదని అధికారులు చెబుతున్నారని, అంటే పెళ్లి కాని వాళ్లు కూడా రుణమాఫీకి అనర్హులా అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని హరీశ్ రావు అన్నారు. హరీశ్ రావు చిట్ చాట్ లో మాట్లాడుతూ.. PAC, PUC, ఎస్టిమేట్ కమిటీల నియామకం శాసన సభలో ప్రకటించాలి. అసెంబ్లీ సమావేశాల్లోనే కమిటీల ప్రక్రియ జరిగింది. ఇది రాజ్యాంగ పరంగా ఉన్న అవకాశం. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ గా నియామకం అయ్యారు. సభలో చెప్పి ఎందుకు ప్రకటించలేదు. ఈ విషయంపై రాహుల్ గాంధీకి ట్వీట్ చేస్తానని హరీశ్ రావు అన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి సూక్తులు చెబుతున్నారు. స్పీకర్ కూడా ఈ విషయంలో చొరవ చూపాలి. తక్షణమే స్పీకర్ కమిటీలను ప్రకటించాలి. మండలిలో ప్రతిపక్ష నేతను తాము ఖరారు చేసిన చైర్మన్ ప్రకటించలేదని హరీశ్ రావు అన్నారు.
Admin
Studio18 News