Studio18 News - తెలంగాణ / : నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజించిన గణనాథుడిని అంతే భక్తిగా జనం సాగనంపుతుండగా, హైదరాబాద్ లోని మణికొండలో విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకూ హుషారుగా డ్యాన్స్ చేసి ఇంటికెళ్లిన యువకుడు గుండెపోటుతో చనిపోవడమే దీనికి కారణం. మణికొండలోని అల్కాపురి కాలనీలో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యాంప్రసాద్... కాలనీలోని వినాయక మంటపం వద్ద ఆదివారం నాడు జరిగిన వేడుకలలో పాల్గొన్నాడు. లడ్డూ వేలం పాటలోనూ ఉత్సాహంగా పాల్గొన్న శ్యాంప్రసాద్... పోటాపోటీగా వేలం పాడి రూ.15 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. ఆ సంబరంతో, సాయంత్రం జరిగిన గణేశ్ శోభాయాత్రలో డ్యాన్స్ చేశాడు. ఇంతలోనే ఏదో పనిమీద ఊరేగింపు మధ్యలోనే ఇంటికి వెళ్లిన శ్యాంప్రసాద్ తిరిగి రాలేదు. గుండెపోటుతో ఇంట్లోనే శ్యాంప్రసాద్ కుప్పకూలాడని, అక్కడికక్కడే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటివరకు శోభాయాత్రలో సందడి చేసిన శ్యాంప్రసాద్ అంతలోనే చనిపోయాడని తెలిసి అల్కాపురి కాలనీ వాసులు విచారం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News