Studio18 News - జాతీయం / : మహిళ అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పటికీ ఆమె భయంతో కానీ, లేదంటే అపోహతో కానీ అంగీకరిస్తే అది అత్యాచారం కిందికే వస్తుందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. పెళ్లి పేరుతో అత్యాచారానికి పాల్పడిన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ రాఘవ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అనీస్ కుమార్ గుప్తా ఏకసభ్య ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. పోలీసుల చార్జ్‌షీట్ ప్రకారం.. నిందితుడు మొదట మహిళను మభ్యపెట్టి ఆ తర్వాత క్రమంగా పెళ్లి పేరుతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. పిటిషనర్, బాధిత మహిళ ఒకరికొకరు తెలిసిన వారని, ఇద్దరూ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. ఏకాభిప్రాయంతోనే వారు శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారని, ఇది చాలాకాలంపాటు కొనసాగిందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. వివాహం చేసుకుంటానన్న వాగ్దానం ప్రకారం ఇది ఏకాభిప్రాయ సంబంధంగా కనిపించినప్పటికీ.. పిటిషనర్ బెదిరింపు, లేదా మాయమాటల కారణంగా ఆమె సమ్మతించి శారీరక సంబంధాన్ని కొనసాగించిందని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఇది అత్యాచారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. పిటిషనర్ కోరిన విధంగా విచారణను రద్దు చేయడం కుదరదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
Admin
Studio18 News