Studio18 News - తెలంగాణ / : KTR : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటన ముంగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. శనివారం ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అసమర్ధుడి జీవన యానంలా రేవంత్ పాలన కొనసాగుతుందని అన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని, ఆయన అటెన్షన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి ఆయనే కండువాలు కప్పుతున్నారు. 10మంది ఎమ్మెల్యేలు వచ్చారు.. ఇంకా వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ అన్నారు. హైకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చింది.. కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవి పోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఏమి తప్పు మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో రేవంత్ ఏమన్నారో తెలియదా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నారు. పదవి పోతుందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త రాగం ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి పదేళ్లలో ఎప్పుడ లేదు. చేతగాని సీఎం ఉండటం వల్లనే ఈ దౌర్భాగ్యం, హైదరాబాద్ లో శాంతిభద్రతలను కంట్రోల్ చేయలేకపోయారని రేవంత్ పాలనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ దగ్గర అనర్హత పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అరెకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి.. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే.. దాడికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చుతోంది. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. రేవంత్ రెడ్డి ఓ చిట్టి నాయుడు.. మేము ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. సీఎం పదవి నుంచి రేవంత్ దిగిపోతే ఇవన్నీ ఆయన్ను వెంటాడుతాయి. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కాంగ్రెస్ హామీలను ప్రశ్నిస్తామని కేటీఆర్ అన్నారు. గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే సరిపోయేది.. కానీ, బీఆర్ఎస్ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం నాయకత్వంలో ప్రాంతీయ తత్వాన్ని తెరపైకి తెస్తున్నారు. మా పదేళ్ల పాలనపై తృప్తితో హైదరాబాద్ ప్రజలు అన్ని సీట్లు గెలిపించారు. హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డి పగబట్టినట్లు ఉంది.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అసహనంతో ఉన్నారు. గాంధీ ఏ పార్టీలో ఉన్నారో శేరిలింగంపల్లి ప్రజలను అడుగుదామని కేటీఆర్ అన్నారు.
Admin
Studio18 News