Studio18 News - తెలంగాణ / : ఐఐహెచ్‌టీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ)ని ఏర్పాటు చేయాలని కోరగానే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి మంజూరు చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. నాంపల్లి తెలుగు అకాడమీలో ఐఐహెచ్‌టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐఐహెచ్‌టీని ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే అభయహస్తం లోగోను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువ నీడను ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం బాపూజీ తన స్థలం కూడా ఇచ్చారన్నారు. పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. కానీ కొంతమంది మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. అలా వచ్చిన ఉప ఎన్నికల సమయంలో సెలెక్షన్లు, కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకున్నారని విమర్శించారు. గజ్వేల్‌లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, కొండా లక్ష్మణ్ బాపూజీల త్యాగాలలోని తేడాలను గుర్తించాలన్నారు. ఉప ఎన్నికల్లో కలెక్షన్లు, సెలెక్షన్లతో కొంతమంది బాగుపడ్డారని మండిపడ్డారు. కానీ బాపూజీ నిస్వార్థంతో తెలంగాణ కోసం త్యాగాలు చేశారని, అందుకే ఐఐహెచ్‌టీకి ఆయన పేరును పెడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో చేనేతల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. సిరిసిల్ల నేతన్నలకు బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక వెంటనే విడుదల చేశామన్నారు. చేనేతల రుణభారం రూ. 30 కోట్లు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు, నూతన ఆవిష్కరణల కోసం ఐఐహెచ్‌టీని ప్రారంభించినట్లు చెప్పారు.
Admin
Studio18 News