Studio18 News - తెలంగాణ / : భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంత్రి తుమ్మల వరద ఉద్ధృతిని పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీటిని బయటకు తోడే ప్రక్రియ, కరకట్ట వద్ద వరద ఉద్థృతి, నూతన కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత ఆర్డీవో కార్యాలయంలో నీటి పారుదల, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, వ్యవసాయ, విద్యుత్, వైద్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... వరదల కారణంగా ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. మరోవైపు, రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 15.80 మీటర్లుగా నమోదైంది. 15.83 మీటర్ల వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. గోదావరి భారీ వరద కారణంగా ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రహదారిని మూసివేశారు.
Admin
Studio18 News