Studio18 News - TELANGANA / : Arekapudi Gandhi : ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ వివాదం విషయంలో గచ్చిబౌలి పోలీసులు గాంధీకి షాకిచ్చారు. గాంధీతో పాటు అతని సోదరుడు, కుమారుడుపైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు కార్పొరేటర్లపైనా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో పాటు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లను పోలీసులు నిందితులుగా చేర్చారు. కౌశిక్ ఇంటి వద్ద ఘటనపై ఎస్ఐ మహేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే గాంధీపై కేసు నమోదైంది. ఆ కేసులో ఎమ్మెల్యే గాంధీ బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే.. గత మూడు రోజుల నుంచి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్న విషయం తెలిసిందే. పీఏసీ చైర్మన్ గా అరెకపూడి గాంధీ నియామకంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ప్రతీసారి ప్రతిపక్ష పార్టీ నేతలకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారని, సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అరెకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గాంధీ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని తెలిపారు. గాంధీ వ్యాఖ్యలకు స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని సవాల్ చేశాడు. గాంధీసైతం నువ్వు నా ఇంటికి రాకుంటే నేనే నీ ఇంటికి వస్తానంటూ ప్రతి సవాల్ చేశారు. వీరిద్దరి మధ్య సవాళ్లతో పోలీసులు ఇరువురి ఇండ్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డిని గృహనిర్భందం చేశారు. అయితే, కౌశిక్ రెడ్డి రాకపోవటంతో తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లదాడి జరగడంతో అతని ఇంటి అద్దం ధ్వంసం అయింది. గాంధీ, ఆయన అనుచరుల తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో తన ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు అరెకపూడి గాంధీతో పాటు అతని సోదరుడు, కుమారుడుపైనా హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
Admin
Studio18 News