Studio18 News - TELANGANA / : Heavy Rain Alert : గత నెల రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారీ వర్షాలకుతోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం, విజయవాడ ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. మున్నేరులోకి రికార్డు స్థాయిలో వరద ప్రవాహంతో ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. బుడమేరుకు గండ్లు పడటంతో విజయవాడలోని పలు డివిజన్లల్లోకి వరదనీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా వరుణుడు శాంతించడంతో వరద ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తుండంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, దాని ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. దీంతో తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, అదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఛత్తీస్ గఢ్ పై బలంగా ఉంది. దీని కారణంగా ఛత్తీస్ గడ్ తోపాటు ఒడిసా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Admin
Studio18 News