Studio18 News - తెలంగాణ / : ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్ తో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రశ్నించింది. ఈ ప్రాసెస్ కు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ పిటిషన్లను పరిశీలించి వాటి విచారణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని స్పీకర్ కు సూచించింది. సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు, వాదనలు ఎప్పుడు వింటారు, ప్రొసీడింగ్స్ ఎప్పుటిలోగా పూర్తిచేస్తారు.. తదితర వివరాలన్నీ ఈ షెడ్యూల్ లో పేర్కొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. అప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకుంటే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరిస్తామని హెచ్చరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే.. బీఆర్ఎస్ పార్టీ టికెట్ తో గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. దీనిపై మండిపడ్డ బీఆర్ఎస్.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.
Admin
Studio18 News