Studio18 News - తెలంగాణ / : Hydra Demolitions : హైడ్రా బృందం మళ్లీ దూకుడు పెంచింది. హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై గత కొద్దిరోజుల నుంచి హైడ్రా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పెద్దపెద్ద భవన నిర్మాణాలనుకూడా నేలమట్టం చేస్తున్నారు. అయితే, గత వారంరోజులుగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడినప్పటికీ.. మళ్లీ కూల్చివేతలపై హైడ్రా బృందం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టింది. బాచుపల్లి, కొత్వా చెరువు, బోరబండ సున్నం చెరువు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి, కొత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ పై హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. చెరువు ఎఫ్టీఎల్, బపర్ జోన్ ను ఆక్రమించి నిర్మించారని, ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. ఇటీవల అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చారు. తాజాగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బోరబండ సున్నం చెరువు కబ్జాకు గురైందని ఇటీవల హైడ్రాకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కొద్దిరోజుల క్రితం హైడ్రా బృందం సున్నం చెరువు వద్ద సర్వే నిర్వహించింది. ఆ తరువాత ఆక్రమణ దారులకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు ఆక్రమణ దారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోటంతో కూల్చివేతలు చేపట్టింది. యాజమానులు మాత్రం హైడ్రా నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెబుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా బృందం చేపట్టింది. అదేవిధంగా దుండిగల్ లో ఉన్న అన్ని చెరువుల పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా బృందం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమార్కుల్లో టెన్షన్ మొదలైంది.
Admin
Studio18 News