Studio18 News - తెలంగాణ / : TS Congress Party : కుండపోత వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మున్నేరు ఉప్పొంగడంతో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు, పలు జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో వరద బాధితులకు సహాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులకోసం రెండు నెలల జీతాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు తమ రెండు నెలల జీతాన్ని సీఎం సహా ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారులుసైతం తమ రెండు నెలల జీతం సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వరద బాధితులకు అండగా నిలిచారు. పార్టీపరంగా బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలని అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెల జీతాన్ని వరద బాధితులకు వితరణగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గత మూడు రోజుల క్రితం ఎక్స్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News