Studio18 News - తెలంగాణ / : ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో, కేంద్ర సాయం పొందేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించింది. రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రేవంత్ సర్కారు తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా... రోడ్లు భవనాల శాఖ పరిధిలో రూ.2,362 కోట్లు, విద్యుత్ శాఖ పరిధిలో రూ.175 కోట్లు, పంటలు రూ.415 కోట్లు, నీటిపారుదల శాఖ పరిధిలో 629 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్థి, తాగునీటి శాఖ పరిధిలో రూ.170 కోట్లు, మున్సిపల్ శాఖ పరిధిలో రూ.1,150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. వారం రోజులుగా అతలాకుతలం చేసిన వరదల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటుండగా, వాస్తవంగా జరిగిన నష్టం ప్రభుత్వం పేర్కొన్న దాని కంటే ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాతే వరద నష్టంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవలి వరదల్లో ఖమ్మం, మహబూబాబాద్, మరి కొన్ని జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కోల్పోయి, పంటలు నష్టపోయి, పశువులు, ఇతర జీవనాధారాలు కోల్పోయిన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
Admin
Studio18 News