Studio18 News - TELANGANA / : konda surekha comments on samantha: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయారని ఆమె ఆరోపించారు. సురేఖ వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. అక్కినేని నాగార్జు, అక్కినేని అమల, అక్కినేని నాగచైతన్య, సమంతతోపాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, వెంకటేశ్, మంచు విష్ణు, అల్లు అర్జున్ పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమ ఫైర్ అవ్వడంతో కొండా సురేఖ స్పందించారు. కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు, కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు.. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. ఏ విషయంలో నేను బాధపడ్డానో.. ఆ విషయంలో మరొకరిని నొప్పించానని తెలిసి తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నానని తెలిపారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నప్పటికీ.. కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు చేస్తున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సినీ పరిశ్రమకు కీలక విజ్ఞప్తి చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సమంత, కొండా సురేఖ అంశాన్ని ఇంతటితో ఆపేయండని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో ఇరువైపులా బాధితులు మహిళలే. బీఆర్ఎస్ ట్రోలింగ్ వల్ల సురేఖ చాలా బాధ పడింది. ట్రోలింగ్ అంశాన్ని సైతం సినీ పెద్దలు పరిగణలోకి తీసుకోవాలి. తన వ్యాఖ్యలను సురేఖ బేషరతుగా ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ విషయం ఇంతటితో ఆపేయండి అంటూ సినీ పరిశ్రమను మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.
Admin
Studio18 News