Studio18 News - TELANGANA / : Bandi Sanjay : తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం మెట్లను శుభ్రం చేశారు. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. సెక్యూలరిజం అంటే వన్ వే మాత్రమే కాదని ఇది టూవే అంటూ తీవ్ర స్థాయంలో మండిపడ్డారు పవన్. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్‌కు మద్దతు ఇవ్వడంతో పాటు ఆయనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే హిందువులమైన మనందరం న్యాయబద్ధంగా గళం విప్పుతామన్నారు. సెక్యూలరిజం అనేది టూ వే మార్గం అని చెప్పారు. తమ జోలికి వస్తే మౌనంగా ఉండబోమని చెప్పారు. “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||” అనే శ్లోకాన్ని సోషల్ మీడియాలో బండిసంజయ్ పోస్ట్ చేశారు.
Admin
Studio18 News