Studio18 News - తెలంగాణ / : చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. హైడ్రా ఏర్పాటు, కూల్చివేతల వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు తమకు లేవని తేల్చిచెప్పారు. ఈమేరకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్), బఫర్ జోన్ లలో కట్టిన బిల్డింగ్ లు ఎంతపెద్ద వారివైనా వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి హైడ్రా ఇప్పటికే పలువురు ఆక్రమణదారులకు, బడాబాబులకు నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. హైడ్రా పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం... అధికారుల పనిలో తమ జోక్యం ఉండదని వివరించారు. కాగా, ఎఫ్ టీఎల్ పరిధిలోని నిర్మాణాలకు సంబంధించిన యజమానులకు హైడ్రా నోటీసులు పంపించింది. వెంటనే వాటిని కూల్చేయాలని హెచ్చరించింది. లేదంటే తామే రంగంలోకి దిగి వాటిని కూల్చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Admin
Studio18 News