Studio18 News - TELANGANA / : కాంగ్రెస్ పార్టీలో పదవులు ఆశించేవారు కేవలం హామీలపైనే ఆధారపడకూడదని, నిబద్ధతతో పనిచేస్తేనే తగిన గుర్తింపు లభిస్తుందని ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని ఆయన కొనియాడారు. మంగళవారం పలు కార్యక్రమాల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. హిమాయత్‌నగర్‌లో సుమారు 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం, ఆదర్శ్ నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 150 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ మంత్రివర్గ కూర్పును చేపట్టారని తెలిపారు. "గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎస్సీ, బీసీ వారికి మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలను, ఆయన ఆలోచనా విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు" అని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి ఎవరికైనా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు దానం నాగేందర్ స్పందిస్తూ, దానికి ఇంకా సమయం ఉందని, అందరూ వేచి చూడాల్సి ఉంటుందని సూచించారు. మంత్రివర్గంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులందరికీ ఆయన తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
Admin
Studio18 News