Studio18 News - తెలంగాణ / : Mallu Ravi : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయారని ఆమె ఆరోపించారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తో పాటు.. టాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. అక్కినేని నాగార్జు, అక్కినేని అమల, అక్కినేని నాగచైతన్యతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల స్పందించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను విని షాకింగ్ గురయ్యానని అన్నారు. ఒక మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని ఆమె పేర్కొన్నారు. రాజకీయ వివాదాల్లోకి తమ కుటుంబాన్ని లాగవద్దని అమల అన్నారు. తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారు.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను నమ్మితే దయచేసి మీ రాజకీయ నేతలను అదుపులో ఉంచుకోండి. మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి అంటూ అమల పోస్టులో పేర్కొన్నారు. అమల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులందరిపై అక్కినేని అమల చెడు వ్యాఖ్యలు చేయడం, రాహుల్ గాంధీ మానవత్వం గురించి మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అన్నారు. రాజకీయ నాయకులపై, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను అమల ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. కొండా సురేఖ బాధాకరమైన మానసిక స్థితితో సోషల్ మీడియా పోస్టింగ్‌లపై స్పందించారు, మహిళా మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకరమైన పోస్టింగ్‌లపై బీఆర్‌ఎస్ మహిళా నేతలు స్పందించలేదు కానీ ఇప్పుడు వారు మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారు. ఇది పక్షపాతం కాదా అని ప్రశ్నించారు. కొండా సురేఖ ఒక బీసీ మహిళ.. తన ఆత్మగౌరవం, గౌరవాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు ప్రతిఒక్కరూ మొత్తం ఎపిసోడ్‌కు మూలకారణాన్ని కనుగొని, ఆపై స్పందించాల్సిన సమయం వచ్చిందని మల్లు రవి పేర్కొన్నారు.
Admin
Studio18 News