Studio18 News - తెలంగాణ / : కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల తెగ్గోసి తెచ్చిన వారికి 1.38 ఎకరాల భూమి ఇస్తానని కాంగ్రెస్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ ‘నంబర్ వన్ ఉగ్రవాది’ అని బిట్టు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రవ్‌నీత్‌సింగ్ బిట్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి తన ఆస్తితోపాటు తన తండ్రి ఆస్తిని కూడా రాసిస్తానని ఆఫర్ ప్రకటించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ఆందోళన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వెడ్మ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. రాహుల్ 'మొహబ్బత్ కి దుకాణ్' అంటే ఇదేనా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదకర కవ్వింపులు, నేరపూరిత ప్రేరేపణలు సర్వసాధారణం అయ్యాయని ఎక్స్‌లో మండిపడింది. మరోవైపు, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆందోళనలు నిర్వహించింది. కంగనపై దానం వ్యాఖ్యలను బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఖండించారు.
Admin
Studio18 News