Studio18 News - తెలంగాణ / : ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో అంటూ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతిరెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఇళ్లు వెంటనే కూలుస్తున్నప్పటికీ, తిరుపతి రెడ్డికి మాత్రం మినహాయింపు లభిస్తోందని విమర్శించారు. ఎల్‌కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా కూల్చేశారని, అలాగే 50 ఏళ్ల కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయిందని పేర్కొన్నారు. 72 గంటల క్రితం కొన్న ఇల్లును కూడా నేలమట్టం చేశారని విమర్శించారు. అన్ని కాగితాలు ఉన్నప్పటికీ... వారం ముందే గృహప్రవేశం చేసిన ఇల్లును కూడా పేకమేడలా కూల్చేశారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తి లేదని హైడ్రా పేర్కొందని, కానీ మీ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదని తిరుపతిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. వాల్టా ఏకంగా మీకు 30 రోజుల సమయం ఇచ్చిందని, కోర్టులో స్టే కూడా సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల విషయంలో మట్టి అంటనిది మీకు మాత్రమే అని చురక అంటించారు. మీ సోదరుడి (రేవంత్ రెడ్డిని ఉద్దేశించి) బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు కూడా ఆ కిటుకు ఏమిటో చెప్పాలని ఎద్దేవా చేశారు.
Admin
Studio18 News