Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్–హెచ్-2843) మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీసిఎస్ అధికారిణి వేల్పుల విజేత మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తి జీవితంలో కూడా మహిళలు ముందంజలో నిలవడం సమాజానికి ఆదర్శమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే పురుషుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, ఈరోజు తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన భర్త అందించిన సహకారమే కారణమని విజేత భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రతి మహిళ తన లక్ష్యాలను చేరుకోవాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ముఖ్యమని, భర్త వెన్నుదన్నుగా నిలిస్తే మహిళలు అద్భుతాలు సృష్టించగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ హారిక నాయుడు మాట్లాడుతూ మహిళా సాధికారత మాటల్లోనే కాకుండా కార్యరూపంలో కనిపించాలన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సేవలను కొనియాడుతూ, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తు చేశారు. జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో మహిళా విలేకరులు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గౌరవరపు జగదీష్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారిణి రమాదేవి, న్యాయవాది శృతి, ఏఎస్ఐ పి. లక్ష్మి, విలేకరి నవజీవన ప్రియ, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షుడు ఎలుగోటి వెంకట్రావు, ప్రెస్ క్లబ్ కోశాధికారి భద్రయ్య, జిల్లెల మహేష్, యాంకర్ నాయిని స్వాతి, యాంకర్ హర్షిక, యాంకర్ రేష్మ, అంతోటి నాగమణి, గౌరవరపు సునీత తదితరులతో పాటు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విలేకరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News