Studio18 News - తెలంగాణ / : రేవంత్ రెడ్డి గారూ... మీ సొంత పార్టీ సీనియర్ నేతనే ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమని చెబుతున్నారు... ఇప్పటికైనా మీరు లెంపలు వేసుకుంటారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జీవన్ రెడ్డిలాంటి సీనియర్ నాయకుడే ఇది (ఫిరాయింపులు) కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని చెబుతున్నారని తెలిపారు. మీ దిగజారుడు రాజకీయాలపై ఆయన దుమ్మెత్తి పోశారని వెల్లడించారు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా? క్షమాపణ చెబుతారా? అని నిలదీశారు. మీరు గడప గడపకు వెళ్లి... చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని ఆయన కూడా పట్టుబడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా? ప్రోత్సహించిన మిమ్మల్నా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని జీవన్ రెడ్డి సొంత పార్టీని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని కేటీఆర్ విమర్శించారు. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని ఆదేశానుసారమే రేవంత్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. బడే భాయ్ ఆజ్ఞలను ముఖ్యమంత్రి తూచా తప్పకుండా పాటిస్తున్నారని, అదాని సంతృప్తి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అదానికి మేలు చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. అందుకే ముఖ్యమంత్రి దుర్మార్గాలపై బీజేపీ మౌనంగా ఉంటుందని ఆరోపించారు. మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News