Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సురేఖమ్మా, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది, కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి విమర్శించే ఆస్కారం ఇవ్వకూడదని రాసుకొచ్చారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలని, తద్వారా సమాజానికి ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా? అని కొండా సురేఖను ఉద్దేశించి ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం బాధాకరమన్నారు. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారని, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణమయ్యారని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఇదిలా ఉండగా, కొండా సురేఖ మీద సోషల్ మీడియా ట్రోల్స్‌ను కూడా సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. తోటి మహిళగా కొండా సురేఖ బాధని తాను అర్థం చేసుకోగలనని, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పుడు బాధ్యతగా ఉండాలని నిన్న పోస్ట్ పెట్టారు.
Admin
Studio18 News