Studio18 News - TELANGANA / HYDERABAD : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ - భారత సిరిధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) ప్రాంగణంలో 'గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్'కు ఆయన శంకుస్థాపన చేశారు. సిరిధాన్యాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, శిక్షణతో పాటు వాటి ప్రాచుర్యం కల్పించే దిశగా ఈ కేంద్రం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను మరింతగా పెంపొందించేందుకు ఈ కేంద్రం మార్గదర్శకంగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్తలు, రైతులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో మంత్రి తుమ్మల భేటీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, భగీరథ్ చౌదరిలతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన పలు అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాన్ని వారికి అందజేశారు. తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల తన లేఖలో ప్రధానంగా కోరారు. ఆయిల్‌పామ్ గెలలకు కనీస మద్దతు ధర క్వింటాలుకు 25 వేల రూపాయలుగా నిర్ణయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌పామ్ దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
Admin
Studio18 News