Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : హైదరాబాద్ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం నిద్దరోతోంది. పైపులైన్లకు అడ్డగోలుగా లీకేజీలు ఏర్పడుతన్నా పట్టించుకోవడం లేదు. నెలరోజులుగా ప్రధాన రహదారిపై మంజీర వాటర్ పైప్ లీకేజీ కావాడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నీరు వృథాగా పోతున్నా జలమండలి, మున్సిపల్ అధికారులు కనిపించకపోవడం అనేది హైదరాబాద్‌తో సహా అనేక పట్టణాల్లో నీటి నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు గత నెలరోజులుగా మంజీర పైప్ లీకేజీ అయింది. దీంతో వేలాది లీటర్ల నీరు వృథాగా పోతూ ప్రధాన రహదారి వెంబడి కూరగాయల మార్కెట్ వరకు రోడ్డుపై పారుతుంది. నీరు ప్రవహిస్తూ ఉండడంతో రోడ్డంతా చిత్తడిగా మారి వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ప్రధాన రహదారి కూడా నీటితో కొంచెం కొంచెం పూర్తిగా చెడిపోయి.. గుంతలుగా మారే అవకాశముంది. నిత్యం వేలాది మంది ప్రజలు, వాహనదారులు ప్రయాణం కొనసాగించే ప్రధాన రహదారిపై చాలా రోజుల నుండి మంజీర నీరు వృథాగా పోతున్నా.. జలమండలి, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకున్న పాపాన పోలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి పైపులైన్ లు.. సరఫరాలో ఉన్న లోపాలతో తరచూ రోడ్లపై పైపులైన్లు లీకవుతున్నాయి. లీకేజీలతో వృథాగా ప్రవహిస్తున్న నీటితో రోడ్లు పాడవుతున్నాయి. లీకేజీలతో సరఫరా చేస్తున్న నీరు రంగుమారుతుందని నగరవాసులు పేర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లీకేజీ కాకుండా మరమ్మత్తులు చేసి సమస్య పరిషర్కరించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Studio18 News