Studio18 News - TELANGANA / NIRMAL : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితి, రైతులకు సాగునీటి అందుబాటు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగినంత స్టాక్ అందుబాటులో ఉంచామని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల లభ్యతపై వ్యాప్తి చెందుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి పాల్గొన్నారు. సమావేశం అనంతరం అధికారులతో మాట్లాడిన ఆమె జిల్లాలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. జిల్లా ప్రజల అవసరాలకు సరిపడినన్ని గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, సరఫరా వ్యవస్థను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రజల గృహ అవసరాల కోసం అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందకూడదని ఆమె కోరారు. అలాగే జిల్లాలో రైతుల పంటలకు అవసరమైన సాగునీరు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, సీపీఓ జీవరత్నం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుధాకర్, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, డీఈవో భోజన్నతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News