Studio18 News - TELANGANA / KARIMNAGAR : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపురం గ్రామంలో ఈరోజు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని వెంటనే ముంపు గ్రామంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో సుమారు ఏడు ట్రాక్టర్లలో గ్రామస్థులు కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే రవిశంకర్ గ్రామానికి వచ్చి నారాయణపురాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, గ్రామస్తులకు నష్టపరిహారం ఇచ్చి వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్యం కూడా ఎన్నికల ముందు నెలకు ఒకసారి గ్రామానికి వచ్చి, గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి అందరికీ వేరే చోట ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల వరకు ప్రతి నెలా గ్రామానికి వచ్చారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. “సత్యం సార్ మా మీద కోపం పెట్టుకోకండి. మాపై కక్ష పెంచుకుని ఇబ్బందులు పెట్టకండి. వెంటనే మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి అందరికీ వేరే చోట ఇళ్లు నిర్మించాలి” అని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వర్షాలు పడినప్పుడు ప్రతి ఇంటిలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Admin
Studio18 News