Studio18 News - TELANGANA / HYDERABAD : నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నుంచి ఓ మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతి చెందిన వ్యక్తి పేరు గురు ప్రీత్ సింగ్‌గా అధికారులు భావిస్తున్నారు. పూర్తి నిర్ధారణ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అంబులెన్స్‌లో డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అచ్చంపేటలో బాధిత కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పరామర్శించనున్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తారు.
ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంది. ఎస్‌ఎల్‌బీసీలో కొన్ని రోజుల క్రితం కార్మికులు పనులు నిర్వహిస్తుండగా దాని పైకప్పు కూలిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎనిమిది మంది కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయారు. వారిలోనే ఇవాళ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.
Admin
Studio18 News