Studio18 News - తెలంగాణ / : అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా తీరు అత్యంత దారుణంగా ఉందంటూ కూకట్ పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కూల్చివేతల తర్వాత చెత్తను తొలగించడంలేదని విమర్శించారు. ఆదివారం కూకట్ పల్లిలోని నల్ల చెరువులో ఆక్రమణల కూల్చివేత జరిగిన తీరును ఎమ్మెల్యే తప్పుబట్టారు. రాత్రి నోటీసులు ఇచ్చి తెల్లవారే కూల్చేస్తున్నారని ఆరోపించారు. బాధితులకు కనీసం ఇంట్లో నుంచి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థలానికి సంబంధించి బాధితుల వద్ద పట్టాలు ఉన్నాయని చెప్పారు. వారికి పరిహారం ఇచ్చాకే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శని, ఆదివారాలు వస్తున్నాయంటే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారంటూ అధికారులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అసలు హైడ్రా విధి విధానాలు ఏంటని ప్రశ్నిస్తూ.. వాటిపై స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. కూల్చివేతల సమయంలో కోర్టు ఆదేశాలనూ లెక్కచేయడంలేదని విమర్శించారు. ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను దూరం చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కూల్చివేతల డ్రామాలు చేస్తున్నారని కృష్ణారావు ఆరోపించారు.
Admin
Studio18 News