Studio18 News - తెలంగాణ / : విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.. శనివారం తెల్లవారుజామున తన తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించిందని, పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ రక్తపుమడుగులో పడి ఉన్నాడని సహోద్యోగులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి డ్యూటీకి వచ్చాడు. ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారుజామున తన తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాసిపెట్టి బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ తండ్రి దూసరి సత్తయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కానిస్టేబుల్ బాలకృష్ణ సూసైడ్ నోట్ రాసింది నిజమేనని ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. ఆ నోట్ లో ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. బాత్రూమ్ కి వెళ్లి తన తుపాకీతో తనే కాల్చుకుని చనిపోయాడని, ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిందని ఏసీపీ తెలిపారు.
Admin
Studio18 News