Studio18 News - తెలంగాణ / : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్లు వేరే దేశానికి వెళ్లి బ్రతుకుతారని భావించానని... కానీ సిగ్గు లేకుండా ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా వివిధ పథకాల పేర్లతో రూ.7 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చామని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని, కానీ మేం చేసేదే చెప్పామన్నారు. "అరె పిచ్చి కేటీఆర్... మీలాగా అమలు చేయలేని హామీలు మేం ఇవ్వలేదు. ఎంత కష్టమైనా నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం" అన్నారు. "కేటీఆర్, హరీశ్ రావుకు ఏం పుట్టింది... మీకు రాజకీయాలు చేయడం తెలుసా?" అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నల్గొండలో అనారోగ్యం బారినపడిన వారు చాలామంది ఉన్నారని, ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర మంది వాడిన నీరు నల్గొండలో పారుతోందన్నారు. మురుగు శుద్ధి కేంద్రాలతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. నగరానికి స్వచ్ఛమైన నీరు అందించాలని వ్యాఖ్యానించారు. ఫ్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం ఎస్‌ఎల్‌బీసీయే అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, మూసీ జల శుద్ధీకరణ అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు. కేసీఆర్ కొడుకు అంటే అందరూ గుర్తు పడతారని, కానీ కేటీఆర్ అంటే ఆయనను ఎవరూ గుర్తు పట్టరని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ కేటీఆర్‌కు అహం తగ్గలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని దేశాలు తిరిగి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కేటీఆర్ రెచ్చగొడితే రెచ్చిపోరని, తమకు స్వతహాగా పౌరుషం ఉందన్నారు.
Admin
Studio18 News