Studio18 News - తెలంగాణ / : Hyderabad Metro : గణేశ్ ఉత్సవాల్లో చివరి అంకమైన గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం ప్రతిష్ట ఏర్పాట్లు చేసింది. విగ్రహాల ఊరేగింపు, ట్రాఫిక్, శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా ట్రాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు నిమజ్జనోత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం మెట్రో, ఎంఎంటీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జన వేడుకలకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. గణనాథుల నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం మంగళవారం అర్ధరాత్రి 1గంట నుంచి తెల్లవారు జామున 2గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయని మెట్రో నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ స్టేషన్ నుంచి అర్ధరాత్రి 1గంటలకు బయలుదేరి 2గంటలకు చివరి స్టేషన్లకు మెట్రో రైళ్లు చేరుకుంటాయని చెప్పారు. ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం, జేబీఎస్ – ఎంజీబీఎస్ కారిడార్ లలో ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను ప్రవేశపెడతున్నారు. లింగంపల్లి – ఫలక్ నూమా, నాంపల్లి – లింగంపల్లి, సికింద్రాబాద్ – నాంపల్లి, ఫలక్ నుమా – సికింద్రాబాద్ తదితర రూట్లలో బుధవారం తెల్లవారు జాము వరకు అందుబాటులో ఉండేవిధంగా ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు గ్రేటర్ ఆర్టీసీ కూడా గణనాథుల నిమజ్జనోత్సవంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక బస్సులను నడపనుంది. సుమారు 600 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికులు ఇళ్లకు చేరే వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇందిరాపార్కు, ఖైరతాబాద్, లక్డీకాపూల్, బషీర్ బాగ్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.
Admin
Studio18 News