Studio18 News - TELANGANA / : వ్యవసాయ పనులకు కూలీలను తీసుకెళుతున్న వాహనం బోల్తా పడిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం బొలెరో బోల్తా పడడంతో అందులోని 40 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులు, స్థానికుల సమాచారం మేరకు.. కొత్తకోట మండలం బూత్కూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పొరుగున ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని ఎంకంపల్లి గ్రామానికి పత్తి ఏరడానికి బయలుదేరారు. నలభై మందికి పైగా కూలీలతో బయలుదేరిన బొలెరో వాహనం పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో అందులోని కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో పలువురు కూలీలు కోలుకోగా.. ముగ్గురు కూలీల పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పారు. కాగా, బొలెరో టైర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read : బీజేపీని కుక్కతో పోల్చిన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
Admin
Studio18 News