Studio18 News - TELANGANA / : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఫార్ములా ఈ-కారు రేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆయనను విచారించేందుకు సన్నద్ధం అవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా గతేడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ-కారు రేస్ జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫార్ములా ఈ-కారు రేసు నిధుల కేటాయింపులలో భారీ అవినీతి జరిగినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికే ఉన్న ఇద్దరు పురపాలక శాఖ అధికారులతో పాటు అప్పట్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతించింది. అలాగే ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు కోసం అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. దీనిపై న్యాయ సలహా మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్‌ను విచారించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
Also Read : హీరో అల్లు అర్జున్ అరెస్ట్
Admin
Studio18 News