Studio18 News - తెలంగాణ / : కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు అవకాశం రాకపోవడం వల్లే తాను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, తన అనుచరుడి హత్యపై పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. సంజయ్ కుమార్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సంజయ్ కుమార్ ఖండించారు. జగిత్యాలలో తమదే అసలైన కాంగ్రెస్ కుటుంబమని తెలిపారు. ఇదే జీవన్ రెడ్డి మాత్రం ఎన్టీఆర్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో చేరి మరో పార్టీతో కలవలేదా? అని నిలదీశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు సంజయ్ కుమార్ తెలిపారు. కానీ తాను పార్టీ ఫిరాయించానని జీవన్ రెడ్డి పదేపదే అనడం సరికాదన్నారు. అయినప్పటికీ తాను ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం జీవన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య అంశంపై కూడా సంజయ్ కుమార్ స్పందించారు. తాము ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదన్నారు. హింస, హత్యలు ఎవరి ఇంట్లో జరిగాయో జగిత్యాల ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమన్నారు.
Admin
Studio18 News