Studio18 News - TELANGANA / KARIMNAGAR : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. శనివారం మొదటి రోజు కరీంనగర్‌లోని ఓల్డ్ హై స్కూల్, ధన్గర్ వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానాన్ని పరిశీలించి విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ప్రథమ చికిత్స మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూడాలని, తరగతి గదుల్లో తగిన వెంటిలేషన్ కల్పించాలని ఆదేశించారు. ఎక్కడా చిన్న తప్పిదానికీ అవకాశం ఇవ్వకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాయి కృష్ణ థియేటర్ సమీపంలోని ఎస్సార్ డీజె స్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరు తెన్నులను పరిశీలించి విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు తగిన సూచనలు చేశారు. పదో తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహించాలని, ఎక్కడా ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో వసతులపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని సూచించారు.
Admin
Studio18 News