Studio18 News - తెలంగాణ / : హీరోయిన్లకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా? అని నిలదీశారు. ఆమెపై సోషల్ మీడియా పోస్టులతో తమకు సంబంధం లేదన్నారు. కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదని చెప్పారు. మాపై ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు బాధపడరా? వారు ఏడవరా? అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ఇదివరకు మాట్లాడిన బూతులను గుర్తుకు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. వారు తిట్టినప్పుడు ఇతరుల మనోభావాలు దెబ్బతినలేదా? అని ప్రశ్నించారు. కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ రెడ్డి నోరును ఫినాయిల్‌తో కడగాలని సూచించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోసినప్పుడు మాట్లాడలేదన్నారు. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ లేకుండా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబులు మూసీ ప్రాంతంలో తిరగాలని సవాల్ చేశారు. జగ్గారెడ్డి, మధు యాష్కీలు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓ అండర్‌స్టాండింగ్ ఉందని ఆరోపించారు. అందుకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడుల గురించి బీజేపీ మాట్లాడటం లేదన్నారు. మూసీ బాధితుల కోసం రేపు ఎల్బీ నగర్‌కు వెళుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు అడ్డొస్తే ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. తమకు ఆత్మరక్షణ కూడా ముఖ్యమే అన్నారు.
Admin
Studio18 News