Studio18 News - తెలంగాణ / : ED Summons to Mohammad Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ చిక్కుల్లో పడ్డినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసులో అజారుద్దీన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరు కావాలని ఆయనకు అందజేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా అజారుద్దీన్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అజహర్ పై దాదాపు 20కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు, తదితరాల సేకరణలో రూ. 20 కోట్లు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అజారుద్దీన్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి సుప్రీంకోర్టు తప్పించింది. సంస్థ పనితీరును పరిశీలించేందుకు రిటైర్డ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. క్రికెట్ బాడీలో అవినీతి, ఎన్నికల సమస్యలను పరిష్కరించే పనిని నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు అప్పగించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజహారుద్దీన్ పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ పై ఓటమిపాలయ్యాడు. అజహారుద్దీన్ టీమిండియా జట్టులో సుదీర్ఘకాలం రాణించాడు. కొంతకాలం కెప్టెన్ గానూ జట్టును నడిపించాడు. తన కెరీర్ లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.. టెస్టుల్లో 6,215 పరుగులు చేయగా.. యాబై ఓవర్ల ఫార్మాట్ లో 9,378 పరుగులు సాధించాడు. అయితే, ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ అజహరుద్దీన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Admin
Studio18 News