Studio18 News - TELANGANA / ADILABAD : Rajarshi Shah జిల్లాలో వంట గ్యాస్ కొరత ఏమాత్రం లేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని Vimal Gas Agencyను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిలిండర్ల స్టాక్ వివరాలు, ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై సమీక్షించి నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, జిల్లాలో మాత్రం ఎలాంటి కొరత లేదని వెల్లడించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలిండర్లను అందజేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ సదుపాయం ద్వారా అందించాలని ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎలాంటి కొరత లేకుండా పౌరసరఫరా, రెవెన్యూ, పోలీస్ శాఖలతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే 1800-425-1939 టోల్ ఫ్రీ నెంబరును సంప్రదించాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్ఓ నందిని, తాహసిల్దార్ శ్రీనివాస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటి మహేష్, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర అధికారులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News