Studio18 News - తెలంగాణ / : తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న ఆయన మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న మధ్యాహ్నం జపాన్‌కు చేరుకున్నారు. భట్టి విక్రమార్క బృందానికి హానిడా ఎయిర్ పోర్టులో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూధన్, అమన్ ఆకాష్ స్వాగతం పలికారు. అనంతరం జపాన్ దేశంలో గల పరిశ్రమలు, తెలంగాణలో పెట్టుబడులకు, భాగస్వామ్య పరిశ్రమలకు గల అవకాశాలపై భారత రాయబారి సిబి జార్జి ఆధ్వర్యంలో అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టికి సంక్షిప్తంగా వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి గౌరవార్ధం భారత రాయబార కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో భట్టి విక్రమార్క వెంట ఆర్ధిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి డి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఉన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ఈ బృందం పర్యావరణ రహిత పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్ సంబంధిత టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాల పరిశీలన కోసం ప్రముఖ పరిశ్రమలను సందర్శించడంతో పాటు వివిధ దిగ్గజ కంపెనీలతో భేటీ కానున్నది. తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ పరిశ్రమలకు తోడ్పాటు, వివిధ పరిశ్రమల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి .. ఆ దేశ ప్రముఖ కంపెనీల పారిశ్రామికవేత్తల సమావేశాల్లో చర్చించనున్నారు. భట్టి జపాన్ పర్యటన షెడ్యూల్ ఇలా అక్టోబర్ 1వ తేదీ (మంగళవారం) ఉదయం పెట్టుబడులతో వచ్చే కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశం, వివిధ పారిశ్రామిక వేత్తలతో విడివిడిగా భేటీలు. సాయంత్రం యామాంషి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సందర్శన. 2వ తేదీ (బుధవారం) తోషిబా, కవాసాకి, యాక్లహామ పరిశ్రమల సందర్శన. రాత్రికి ఒకాసలో బస 3వ తేదీ (గురువారం) పానాసోనిక్ హెడ్ క్వార్టర్స్ సందర్శన. అనంతరం తెలంగాణకు తిరుగు ప్రయాణం.
Admin
Studio18 News