Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ నోటీసులు పంపారు. వారంలోపు బండి సంజయ్ క్షమాపణలు చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... లీగల్ నోటీసులతో తమను బెదిరించాలని చూస్తే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక ఈ నోటీసులు పంపించారని, కేటీఆర్ పరిస్థితిని చూస్తుంటే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదన్నారు. కేటీఆర్‌పై తాను మొదట ఆరోపణలు చేయలేదని, తనపైనే ఆయన మొదట చేశారని, దీంతో తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. కేటీఆర్ బాగోతం ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు అంశాల్లో ఏం జరిగిందో యావత్ తెలంగాణకు తెలుసునన్నారు. ఆ కేసులను నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పటి వరకు తాను కేటీఆర్ మాటలకు మాటలతోనే కౌంటర్ ఇచ్చానని, తనకు లీగల్ నోటీసులు పంపించినందున తానూ నోటీసులతోనే బదులిస్తానని తెలిపారు. తాము చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తామని, వాటితోనే ముందుకు సాగుతామన్నారు.
Admin
Studio18 News