Studio18 News - TELANGANA / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై ఈరోజు నాంపల్లి హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు వెళ్లారు. సీఎంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‍లో కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసిన అబద్ధపు ప్రచారం వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. మే 4వ తేదీన కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ నేత పరువు నష్టం దావా నేపథ్యంలో కోర్టు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
Also Read : విజయసాయిరెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్... విచారణ వాయిదా
Admin
Studio18 News