Studio18 News - TELANGANA / : తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చావు డప్పు కొట్టాలని, కానీ పెళ్లిలో డీజే కొట్టినట్లుగా అసెంబ్లీలో వలె గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్దరించిందన్నట్లుగా గవర్నర్ ప్రసంగం సాగిందని విమర్శించారు. ఈ ప్రసంగం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్‌లా ఉందని ఎద్దేవా చేశారు. 420 హామీల్లో ఒక్క హామీ నెరవేర్చకుండా లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్ మందలిస్తారని భావించామని, కానీ గాంధీ భవన్‌లో కార్యకర్త ప్రసంగించారని ఆయన విమర్శించారు. ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదని ఆయన అన్నారు. ఢిల్లీకి మూటలు పంపడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని విమర్శించారు. దావోస్ ద్వారా లక్షా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని డబ్బా కొట్టారని, కానీ తాము తీసుకొచ్చిన కంపెనీలు ఈరోజు ఇతర రాష్ట్రాలకు తరలి పోయాయని అన్నారు. రుణమాఫీ పూర్తయిందని గవర్నర్ చేత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని ఆరోపించారు. ఈ ప్రసంగంతో గవర్నర్ స్థాయిని తగ్గించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో రైతులకు భరోసా ఇచ్చే ఒక్క మాట కూడా లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు స్వాంతన, భరోసా ఇచ్చే మాట రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల వేలాది ఎకరాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. సాగునీటి సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ ప్రసంగంలో ఊసు లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు ఏమీ లేవని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అయిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని, 14 నెలల కాలంలో ఇదంతా చేశారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలోనే వరిధాన్యంలో తెలంగాణ ముందు నిలిచిందన్నారు. కాంగ్రెస్ హయాంలో పంటలు ఎండబెట్టడం వల్ల, రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల, విద్యుత్ అస్తవ్యస్తం వల్ల, రైతుల ఆత్మహత్య వల్ల ఈ ఏడాది కాలంలో తెలంగాణ నెంబర్ వన్ అయిందా? అలా చెప్పడానికి సిగ్గుండాలని దుయ్యబట్టారు. లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే రైతులను ఓదార్చడానికి ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే రావడం లేదని ఆయన అన్నారు. ఊళ్లల్లోకి కాంగ్రెస్ నేతలు వస్తే ప్రజలు, రైతులు తరిమితరిమి కొడుతున్నారని అన్నారు. తెలంగాణలోని ఏ గ్రామంలో కూడా 25 శాతం నుండి 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరుకు కూడా వెళ్లి చూద్దామని సవాల్ చేశారు. లక్షా అరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసి ఒక్క పథకాన్ని కూడా ప్రారంభించని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. 20 శాతం కమీషన్, 30 శాతం ల్యాండ్ డీల్స్ జరుగుతోందని, ఈ ఆరోపణలు తాను చేయడం లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని అన్నారు. కమీషన్ ఇస్తేనే మంత్రులు పని చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్, కాంగ్రెస్ కమీషన్లను తట్టుకోలేక తెలంగాణలో నిర్మాణ రంగం కుదేలయిందని అన్నారు. 'తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంటే, గవర్నర్‌తో చెప్పించిన ప్రతి పదం అబద్దం, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట అసత్యం, ప్రతి వాక్యం పచ్చి మోసం' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News