Studio18 News - తెలంగాణ / : దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉద్యోగులకు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన దసరా దగ్గరకు వచ్చినప్పటికీ ఉద్యోగుల చేతిలో డబ్బులు లేక సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారని రాసుకొచ్చారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాల్లేవ్... పంచాయతీ కార్మికులు... మున్సిపాలిటీ కార్మికులు... ఆసుపత్రి సిబ్బంది... హాస్టల్ వర్కర్స్... గెస్ట్ లెక్చరర్స్... ప్రతీ శాఖలోనూ వేతనాల్లేక చిరుద్యోగులు విలవిల్లాడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారని రాసుకొచ్చారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని పలికిన ప్రగల్భాలు ఎటు పోయాయని నిలదీశారు. దసరా దగ్గరకు వచ్చినప్పటికీ సరుకులు కొనడానికి ఉద్యోగుల చేతిలో నయాపైసా లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెడితే బతుకుబండి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ 10 నెలల పాలనలో తెచ్చిన రూ.80 వేల కోట్ల అప్పులు ఎక్కడకు పోయాయో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిరుద్యోగులు, చిన్న జీతాల కార్మికుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News