Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు... ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్బంధాలతోనే నడుస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాదిగలను నమ్మించేందుకు ముఖ్యమంత్రి ఎన్నో ప్రకటనలు చేస్తున్నారని, కానీ వాటిని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండానే 11 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు భర్తీ చేశారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణను వర్తింపజేస్తామని చెప్పిన సీఎం... అమలు చేయకుండానే పోస్టులను భర్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన మాటలకే విలువ లేకుండా పోయిందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు వర్గీకరణను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వర్గీకరణ తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రూప్ 4 ఫలితాలు ఇప్పటికే 16 నెలలు ఆగిపోయాయని, వర్గీకరణ జరిగే వరకు మరో రెండు నెలలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేసి, కమిషన్ల పేరుతో జాప్యం చేసి, ఉన్న ఉద్యోగాలను కొల్లగొడుతామంటే మాదిగ జాతి ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ నెల 16న వరంగల్‌లో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ సమావేశంలో అన్ని కమిటీల సభ్యులు పాల్గొంటారని వెల్లడించారు.
Admin
Studio18 News