Studio18 News - TELANGANA / RANGAREDDY : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని మాన్సూరాబాద్ డివిజన్‌లో ఉన్న పెద్ద చెరువు, హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని కుమ్మరికుంట చెరువుల్లో పేరుకుపోయిన గుఱ్ఱపుడెక్క ఆకును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వాకర్స్ మాట్లాడుతూ ఇక్కడికి వాకింగ్ రావాలంటే దోమల వల్ల ఎక్కడ విషజ్వరాలు వస్తాయో అనే భయంతో ఉన్నామని తెలిపారు. దోమల ప్రభావం కారణంగా చాలామంది ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు రావడానికి జంకుతున్నారని పేర్కొన్నారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత భారస ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ముందుచూపుతో ఆలోచించి నియోజకవర్గ పరిధిలోని చెరువుల్లో గుఱ్ఱపుడెక్క ఆకు పేరుకుపోకుండా కాలనీ వాసుల సౌకర్యార్థం దోమల నివారణకు డ్రోన్ల సహాయంతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించి సఫలీకృతం చేసినట్టు తెలిపారు. అలాగే చెరువుల్లో దోమల వల్ల ఉత్పత్తి అయ్యే లార్వాను అరికట్టేందుకు వేలాది గంబూజియా జాతికి చెందిన చేప పిల్లలను చెరువుల్లో విడిచిపెట్టడం ద్వారా అవి లార్వాను మింగి దోమల వ్యాప్తిని అరికట్టినట్టు గుర్తు చేశారు. డ్రోన్ పరిజ్ఞానంతో చెరువు మధ్యలోకి వెళ్లలేని ప్రాంతాల్లో కూడా దోమల నివారణ మందులు చల్లడం జరిగినట్లు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా చెరువుల్లో పెరుగుతున్న గుఱ్ఱపుడెక్క ఆకును తొలగించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వెళ్లాలంటే దోమల దండయాత్ర వల్ల ఎక్కడ మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వస్తాయోనని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ తమ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఇట్టి ప్రభుత్వం ఫోర్త్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రస్తుతం ఉన్న నగరాన్నే కాపాడుకోలేకపోతుందని, జంట నగరాల అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. సాయంత్రం సమయంలో వాకింగ్‌కు వెళితే పక్కవారితో మాట్లాడే సమయంలో వారి నోట్లోకి కూడా దోమలు దూరుతున్నాయని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. అలాగే ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని చెరువుల్లో పేరుకుపోయిన గుఱ్ఱపుడెక్క ఆకును రెండు మూడు రోజుల్లో తొలగించి, అనంతరం చుట్టుపక్కల కాలనీలలో దోమల నివారణ స్ప్రే చేయించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, చెన్నగొని శ్రీధర్ గౌడ్, జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, భాస్కర్ సాగర్, గోరిగే ప్రదీప్ తదితర నాయకులు, చుట్టుపక్కల కాలనీ వాసులు, పలువురు వాకర్స్ పాల్గొన్నారు.
Admin
Studio18 News