Studio18 News - తెలంగాణ / : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓసారి తెలంగాణకు వచ్చి... ఇక్కడ మేకల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అతిపెద్ద మేకల వ్యాపారిని అందించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యం ప్రదర్శించారు. ఎమ్మెల్యేలను మేకలు, గొర్రెలను కొన్నట్లు కొంటున్నారని విమర్శించారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్గే మాట్లాడుతూ... ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ఎమ్మెల్యేలను మేకలను కొంటున్నట్లుగా కొంటున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ అతిపెద్ద మేకల కొనుగోలు మార్కెట్‌ను తెరిచిందని ఎద్దేవా చేశారు. మీ ముఖ్యమంత్రి మా (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. తెలంగాణ మేకల మార్కెట్‌కు తాను ఖర్గేను స్వాగతిస్తున్నానన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారన్నారు. ఖర్గే గారు, దేశంలోనే అతిపెద్ద మేకల కొనుగోలు మార్కెట్ కాంగ్రెస్‌దే అన్నారు. అసలు ఆయారాం... గయారాం సంస్కృతిని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారికి కూడా తెలియని దయనీయ పరిస్థితిలో ఉన్నారన్నారు. వారిని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నిలబెట్టి ఫిరాయింపులపై అడగాలని ఖర్గేను డిమాండ్ చేశారు.
Also Read : సోషల్ మీడియాలో నాపై ప్రచారాన్ని జగన్ ప్రోత్సహించారు: షర్మిల
Admin
Studio18 News