Studio18 News - TELANGANA / HYDERABAD : MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఏపీ, తెలంగాణలో ఆయన చేసిన సామాజిక సేవలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, మందకృష్ణ మాదిగతో పాటు పలువురు తెలుగువాళ్లకు సైతం పద్మ అవార్డులు దక్కాయి. దీంతో మందకృష్ణ మాదిగ అనుచరులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన మందకృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశారు. 1994లో ప్రకాశం జిల్లాలోని ఈదుమూడి అనే చిన్నగ్రామం నుంచి 20 మంది యువకులతో 'మాదిగ దండోరా' అంటూ పోరాటం సాగించారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని సుదీర్ఘ: కాలం ఉద్యమం చేశారు. ఆయన చేసిన పోరాట ఫలితంగా సుప్రీం కోర్టు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ జరగాలని అంగీకరించాయి. ఇటీవల ప్రధాని మోడీ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంలోనే మందకృష్ణకు పద్మశ్రీ ప్రకటించడంతో పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా స్టూడియో 18 న్యూస్ అధినేత భరత్ కుమార్ శర్మ సైతం మందకృష్ణకు అభినందనలు తెలుపుతూ ఆయన చేసిన సేవలకు నేడు సరైన గౌరవం, సముచిత స్థానం లభించిందని కొనియాడారు.
Admin
Studio18 News