Studio18 News - తెలంగాణ / : తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా 35,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ విడుదల చేసిందని, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని అన్నారు. ఈవెంట్ మేనేజర్‌లా రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందచేస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. 43 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ తాము మొదలుపెట్టినదేనని చెప్పుకొచ్చారు. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ ప్రభుత్వానిది ఆర్భాటం తప్ప మరేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టో కాస్తా భస్మాసుర హస్తంగా మారుతోందని బాల్క సుమన్ చెప్పారు. నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కారు మభ్యపెడుతోందని, నిరుద్యోగులు మరో పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.
Admin
Studio18 News