Studio18 News - తెలంగాణ / : సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో కూల్చి వేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా స్పందించింది. మల్కాపూర్ చెరువులో కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చి వేతలు హైడ్రా చేయలేదని తెలిపింది. హైడ్రాపై అసత్య వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే పరిమితమని తెలిపారు. ఆ కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ వార్తలు రావడం విచారకరమని అన్నారు. హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికి కొంత మంది చేస్తున్న ప్రయత్నాలను సోషల్ మీడియాలు అనుసరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి ఘటనలో హోంగార్డు గాయపడితే హైడ్రా బలి తీసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం దురదృష్టకరమని అన్నారు. అంతే కాకుండా ఇటీవల కూకట్ పల్లి చెరువు పరిసరాల్లో ఇంటిని కూల్చివేస్తారేమో అని బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడాన్ని కూడా హైడ్రాకు ఆపాదించారని, ఆమెకు హైడ్రా నోటీసులు కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలు జరిగినా హైడ్రాకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు.
Admin
Studio18 News