Studio18 News - TELANGANA / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వీడియోల వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ మీడియాకు వెల్లడించారు. 'నిప్పు కోడి' అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా ముఖ్యమంత్రిని తిడుతున్న వీడియో వైరల్‌గా మారిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాశ్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పల్స్ టీవీకి చెందిన ఒక రిపోర్టర్ గుర్తు తెలియని వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారని, ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. పల్స్ టీవీ ఉద్దేశపూర్వకంగా అతనితో ఈ వ్యాఖ్యలు చేయించిందని విచారణలో తేలిందని వెల్లడించారు. పల్స్ టీవీలో వచ్చిన ఈ వీడియోను 'నిప్పు కోడి' అనే ఎక్స్ హ్యాండిల్‌లో ట్రోల్ చేసినట్లు తెలిపారు. కేసు దర్యాఫ్తు చేసి టీవీ ఛానల్ సీఈవో, జర్నలిస్టు రేవతితో పాటు పల్స్ ఛానల్ ప్రతినిధి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఒక లోగో, ఒక రూటర్, 7 సీపీయూలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రేవతిపై గతంలో బంజారాహిల్స్, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు అడిషనల్ సీపీ తెలిపరు.
Admin
Studio18 News